-ప్రజలు అందించిన ఘన విజయం మరింత బాధ్యతను పెంచింది – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
-మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణకు ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఘన సన్మానం.. కూటమి నేతల సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఘన విజయాన్ని అందించడంతో విజయవాడలో కూటమి శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ మక్కెన మల్లికార్జునరావు, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న, గద్దె అనురాధ తదితరులు పాల్గొని నూతన మేయర్‌కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ నగర ప్రజలు మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణకు పట్టం కట్టారని, కూటమిపై తమకున్న విశ్వాసాన్ని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా చాటిచెప్పారని అన్నారు. మొత్తం 86 డివిజన్లలో ఎనిమిది మినహా మిగిలిన అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ప్రజలు అందించిన తిరుగులేని తీర్పుకు నిదర్శనమన్నారు.
76 డివిజన్లలో విజయం సాధిస్తామని అంచనా వేయగా, 78 డివిజన్లలో కూటమి అభ్యర్థులు గెలుపొందడం విశేషమని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ ప్రజలు కూటమికి ఇంతటి ఘన విజయాన్ని అందించారని, ఓటింగ్ శాతం మరింత పెరిగి ఉంటే రెండు లక్షల మెజారిటీని కూడా దాటేవారమని అభిప్రాయపడ్డారు.
ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరంలో కూటమి పాలకవర్గం సమన్వయంతో పనిచేసే ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో విజయవాడ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల మద్దతు కూటమికే ఉంటుందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ప్రజలు వంగవీటి రాధాకృష్ణకు మేయర్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు.
కూటమిలో సీట్ల పంపిణీ విషయంలో నిర్ణయం కొంత ఆలస్యం కావడం, కొన్ని ఇతర కారణాల వల్ల మరో మూడు, నాలుగు స్థానాల్లో విజయావకాశాలు కోల్పోయామని ఎంపీ పేర్కొన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అద్భుతమైన ఫలితాన్ని సాధించారని అభినందించారు.
ఎబి వెంకటేశ్వరరావు గారితో పాటు ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా ఎవరైనా మంచి సూచనలు చేస్తే వాటిని స్వీకరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. వైసీపీతో పాటు కొన్ని ఇతర పక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించలేదని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా విశ్వాసానికే ఓటు వేశారని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, తనను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై విజయవాడ ప్రజలు చూపిన అపారమైన అభిమానానికి, నమ్మకానిక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తనకు అండగా నిలిచి విజయానికి కృషి చేశారని తెలిపారు.
విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను, కార్పొరేటర్లను కలుపుకొని నగరంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తన గెలుపు కోసం కూటమి అభ్యర్థులందరూ సమష్టిగా కృషి చేశారని, ప్రతి ఒక్క కార్పొరేటర్ తమ విజయం కోసం ఒక సవాలుగా తీసుకొని పనిచేశారని కొనియాడారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
“ఈ గెలుపు నాది కాదు.. ఇది విజయవాడ ప్రజల గెలుపు. నాపై నమ్మకం ఉంచి మేయర్‌గా అవకాశం కల్పించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ విజయవాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను” అని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు.
విజయవాడ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ముందడుగు
ఎన్నికల్లో ప్రజలు అందించిన ఘన విజయాన్ని బాధ్యతగా భావిస్తూ, విజయవాడ నగర అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆకాంక్షించారు. నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ విజయవాడను అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు
