ఎన్టీఆర్ జిల్లా మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం

-విజయోత్సాహంతో కళకళలాడిన ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం
-విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో విజయవాడలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయానికి తరలివచ్చారు.

విజయం సాధించిన అభ్యర్థులు, వారి అనుచరులు, కూటమి నాయకులు, కార్యకర్తల రాకతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది. ఎటుచూసినా విజయోత్సాహం, అభినందనలు, ఆత్మీయ పలకరింపులతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని విజయం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థిని వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా ఎంపీ అభినందించారు. సమష్టి కృషి, నాయకుల సమన్వయం, కార్యకర్తల నిరంతర శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి, స్థానిక సంస్థలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.

కూటమి అభ్యర్థుల విజయంతో ఎంపీ కార్యాలయంలో నెలకొన్న సందడి, ఉత్సాహం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.