అధికార బలం, బెదిరింపులకు భయపడేది లేదు… : దేవినేని అవినాష్

-ప్రజల పక్షాన పోరాటం ఆగదు.. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అధికార బలం, బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల పరిణామాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ ఒత్తిళ్లకు భయపడకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొన్నారని అవినాష్ పేర్కొన్నారు. బైండోవర్ కేసుల పేరుతో వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేసి పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ పార్టీ శ్రేణులు వెనుకడుగు వేయలేదన్నారు. కౌంటింగ్ సమయంలో రీకౌంటింగ్‌లు నిర్వహించి కూటమి అభ్యర్థులు విజయం సాధించారని ఆరోపించారు. అధికార పక్షం డబ్బు, అధికార బలంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని విమర్శించారు. ఇన్ని ఒత్తిళ్లు ఎదురైనా వైసీపీ అభ్యర్థులు ధైర్యంగా ఎన్నికల్లో పోరాడారని, నైతికంగా విజయం సాధించారని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో విజయవాడ ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, సమస్యలను పరిష్కరించకపోయినా వైసీపీ తరఫున ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజల సంక్షేమమే తమ బాధ్యతగా గుర్తించి పనిచేయాలని సూచించారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించిన ఆయన, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా పాలన సాగించాలని కోరారు. 86 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కార్పొరేటర్ అభ్యర్థులకు అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా చురుగ్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి నాయకులు, కార్యకర్తలంతా ఆయన వెంట నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 29 మంది వైసీపీ అభ్యర్థులకు, స్థానిక ప్రజలకు తాను అండగా ఉంటానని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే ప్రజల తరఫున నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు.