గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరుగుతున్న పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకులు వి. వీర బ్రహ్మయ్య పరిశీలించారు. నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్‌తో కలిసి పంపిణీ ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ, పోలింగ్ మెటీరియల్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరవేసే వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంటూ, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
