అర్న‌బ్ చీకట్లను తొల‌గించేందుకు అంత‌రాష్ట్ర‌ చేయూత

-ఇంధ‌న మంత్రి గొట్టిపాటికి తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భట్టి ఫోన్..
-అవసరమైతే మరింత సిబ్బంది, సామగ్రి పంపుతామని హామీ
-బురద.. వరద.. ప్రమాదకర చెరువుల మధ్య విద్యుత్ సిబ్బంది పోరాటం
-క్షేత్ర స్థాయిలో ఏపీ, తెలంగాణకు చెందిన 5,500 మంది
-ఆదివారంలోగా అంద‌రికీ విద్యుత్ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా విధులు
-ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కోసం జ‌రుగుతున్న ప‌నుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి మరింత భరోసా లభించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.., విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు శ‌నివారం ఫోన్ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులు, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఆరా తీశారు. సిబ్బంది, సామగ్రి కొరత ఉంటే తెలియజేయాలని, అవసరమైతే తెలంగాణ నుంచి ఎలాంటి సహాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. ఈ సంద‌ర్భంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను మంత్రి గొట్టిపాటి ఆయనకు వివరించారు. తెలంగాణ నుంచి వచ్చిన 1,100 మందికి పైగా విద్యుత్ సిబ్బంది ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ డిస్కంలకు చెందిన మరో 4,400 మంది సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో ఉన్నారని వివరించారు. మ‌రోవైపు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ స‌హ‌కారాన్ని కూడా కోర‌డంతో అక్క‌డి నుంచి కూడా సానుకూల స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడు నుంచి కూడా సాయం అందుతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఒక్క అడుగు తడబడినా ప్రమాదమే…

ఒక‌ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ – తెలంగాణ – త‌మిళ‌నాడు మధ్య సమన్వయంతో అదనపు విద్యుత్ రంగ నిపుణులు రంగంలోకి దిగుతుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితులతో పోరాడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్, పాలకొల్లు సెక్షన్ పరిధిలోని ఆదర్త్యపాలెంలో పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మోకాళ్ల లోతు బురద.. చుట్టూ వరద నీరు.. పక్కనే ప్రమాదకరమైన చేపల చెరువులు. ఒక్క అడుగు తడబడినా ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లోనూ విద్యుత్ సిబ్బంది గంటల తరబడి నీటిలో నిలబడి 11 కేవీ లైన్లను పునరుద్ధరిస్తున్నారు. తమ కుటుంబాలను ఇళ్ల వద్ద వదిలి.. ప్రజల ఇళ్లలో తిరిగి వెలుగులు నింపాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. బురద, వరద నీరు, ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా స్తంభాలు, విద్యుత్ లైన్లను పున‌రుద్ధ‌రించి ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్నారు.

విధి నిర్వ‌హ‌ణ‌ కాదు…. అంత‌కు మించిన‌ ప్రజాసేవ

క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది చూపుతున్న అంకితభావంపై మంత్రి గొట్టిపాటి శ‌నివారంనాడు ప్రత్యేకంగా స్పందించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రజలకు విద్యుత్ అందించేందుకు వారు చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిదన్నారు. “ఇది కేవలం డ్యూటీ మాత్రమే కాదు.. ప్రజాసేవ పట్ల వారి అంకిత భావానికి నిదర్శనం. ఈ కష్టకాలంలో క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడుతున్న ప్రతి విద్యుత్ కార్మికుడికి, అధికారుల బృందానికి శిరస్సు వంచి అభినందనలు” అని గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగాలని, చీకట్లు తొలగి మళ్లీ దీపాలు వెలగాలన్న లక్ష్యంతో సిబ్బంది., బురద నీటిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆయ‌న‌ తెలిపారు. పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని, పునరుద్ధరణ పూర్తయ్యే వరకు సంయమనం పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.

ఆదివారంనాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ స‌ర‌ఫ‌రా…

తుపాను ప్రభావిత ప్రాంతాల‌ల్లో విద్యుత్ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించామ‌ని మంత్రి గొట్టిపాటి తెలిపారు. తెలంగాణకు, ఏపీకి చెందిన సుమారు 5,500 మందికిపైగా సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని ఆయ‌న‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క నుంచి వచ్చిన ఫోన్ మరింత భరోసానిచ్చిందని సంతృప్తి వ్య‌క్తం చేశారు. విపత్తు వేళ తెలంగాణ అందిస్తున్న సహకారానికి మంత్రి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు. అర్న‌బ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసి ఆదివారంలోగా అందరికీ విద్యుత్ సరఫరా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అందుబాటులో ఉన్న సిబ్బంది, సామగ్రిని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ యుద్ధప్రాతిపదికన ప‌నులు కొనసాగిస్తున్నామన్నారు. ఒకవైపు పొరుగు రాష్ట్రాల‌ నుంచి అందుతున్న చేయూత.. మరోవైపు బురద, వరదను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది సాగిస్తున్న పోరాటం.. తుపాను మిగిల్చిన చీకట్లను వీలైనంత త్వరగా తొలగించాలన్న లక్ష్యానికి బలాన్నిస్తున్నాయ‌ని మంత్రి గొట్టిపాటి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.