రాజకీయాల్లో ఓ శకుని.. శిఖండి గా జగన్..

-ఎన్నికల్లో అక్రమాలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
-ఆర్థిక నేరగాడు, ఉగ్రవాది జగన్‌.. ప్రత్యర్థులపై డబ్బు ఆరోపణలా?
-మరో 24 గంటల్లో వైకాపాను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధం
-కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టడం ఖాయం
-ఓటమిని జీర్ణించుకోలేక వ్యక్తిగత ప్రతిష్ఠపై జగన్‌ దాడి
-మేనమామగా కూడా పనికిరాని నీకు నీతులు మాట్లాడే హక్కు ఉందా?
-వైశ్యులను రాజకీయ పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు
-మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మరో 24 గంటల్లో పురపాలక ఎన్నికల ద్వారా వైకాపాను భూస్థాపితం చేసి, కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు విశాఖ నుంచి అనంతపురం వరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, భాజపా జాతీయ నాయకుడు సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎదురయ్యే పరాజయాన్ని జీర్ణించుకోలేక జగన్‌ రాజకీయాల్లో శకుని పాత్ర పోషిస్తున్నారని విరుచుకపడ్డారు. సొంత సోదరి కుమార్తె వివాహానికి ఆమె ఇంటినే ఇచ్చేందుకు కూడా అంగీకరించని వ్యక్తి, రాజకీయాల్లో మాత్రం శకునిలా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత ప్రసార మాధ్యమాల ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేయడం జగన్‌ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని దుయ్యబట్టారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక వ్యక్తుల పేర్లతో తప్పుడు ప్రచారాలు చేయించడం, ఆడియోలోని సారాంశాన్ని వక్రీకరించి రాజకీయ గందరగోళం సృష్టించడం జగన్‌కు అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. ధర్మవరంలో రెండేళ్ల కిందట కలవల రాము స్థల వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ మాట్లాడిన అంశాలను వక్రీకరించి, తాను బెదిరించినట్లు ఇప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తన ద్వారా ఆయనకు న్యాయం జరిగిందని, అయితే వాస్తవాలను వక్రీకరించి రాజకీయాలకు ముడిపెట్టడం ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిఖండిలా తెరవెనుక ఉండి తప్పుడు ప్రచారాలు

తాను ఇటీవల అనంతపురంలో ఉద్యోగులతో మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి అనుకూలంగా స్పందిస్తే, బెదిరించినట్లు జగన్‌ సొంత మీడియా ద్వారా ప్రచారం చేయించారని మంత్రి గుర్తు చేశారు. అయితే స్వయంగా ఆనాటి ఉద్యోగులే ఆ ప్రచారాన్ని ఖండించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా శిఖండిలా తెరవెనుక ఉండి తన మీడియా ద్వారా వ్యక్తులపై బురదజల్లడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన అంశాలను కూడా వక్రీకరించడం ఏమిటని ప్రశ్నించారు.

జగన్‌ గారూ.. రాజకీయ విమర్శలు చేయాలంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి. మీ హయాంలో ప్రజలకు ఏం చేశారు? ఏయే హామీలు అమలు చేశారు? రాష్ట్రానికి ఏం మేలు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతేకానీ వ్యక్తిగత వివాదాలను రాజకీయాలకు ముడిపెట్టి, వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయడం ఏ రకమైన రాజకీయ సంస్కృతి? అని మంత్రి ప్రశ్నించారు.

వైశ్యులను రాజకీయ పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు

వైశ్యుల పేర్లను రాజకీయ వివాదాల్లోకి లాగి వారి ఓట్లను పొందాలని చూడటం రాజకీయ రాక్షస క్రీడ అని సత్యకుమార్‌ యాదవ్‌ దుయ్యబట్టారు. విజయవాడలో చేనేత కార్మికుడిని కిడ్నాప్‌ చేసి కొట్టిన ఘటనపై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో చేనేత కార్మికుడిని హత్య చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు కులాల పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేయడం ఏమిటని నిలదీశారు. వైశ్యులు రాజకీయ పార్టీల చేతిలో పావులు కాదని, తమకు నచ్చిన నాయకుడిని, పార్టీని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు వారికుందని స్పష్టం చేశారు.

వైశ్యులు కులమతాలకు అతీతంగా ఆలోచించి తమ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. విజయవాడతో పాటు అనంతపురంలోనూ వైశ్య వర్గం నుంచి తమకు విశేష మద్దతు ఉందని, ఆయా ప్రాంతాల్లో సుమారు 90 శాతం మంది వైశ్య ఓటర్లు తమకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం కూడా వైశ్య వర్గ ప్రతినిధులు తమ మద్దతును స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వైశ్యుల సామాజిక సేవ, వ్యాపార రంగంలో వారి పాత్ర, సమాజ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాంటి వర్గాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగి, కులాల మధ్య అపోహలు సృష్టించి ఓట్లు పొందాలనుకోవడం జగన్‌ మానుకోవాలని హితవు పలికారు.

మేనమామగా కూడా బాధ్యత నిర్వర్తించలేని నీకు నీతులెందుకు?

ఇతరులకు నీతులు చెప్పే ముందు జగన్‌ తన కుటుంబ సంబంధాల విషయంలో అనుసరించిన వైఖరిపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. సొంత తల్లి, సోదరి విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాలకు దిగడం తగదన్నారు. సొంత మేనమామగా కూడా బాధ్యతలు నిర్వర్తించలేని వ్యక్తికి ఇతరులకు నీతులు చెప్పే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో దళితుడు డాక్టర్‌ సుధాకర్‌ ఘటన, డోర్‌ డెలివరీ హత్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఆర్జించిన జగన్‌, తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. ఆర్థిక నేరగాడిగా, ఉగ్రవాదిగా వ్యవహరించిన జగన్‌ ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థులు డబ్బు ఖర్చు పెట్టబోతున్నారని ప్రచారం చేయడం అవివేకమని మండిపడ్డారు. తెరవెనుక శకునిలా రాజకీయ కుట్రలు చేస్తూ, శిఖండిలా ఇతరుల వెనుక దాక్కొని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఎన్నికల్లో అక్రమాలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

పురపాలక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తాను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు, జగన్ ప్రచారం చేస్తున్నట్లు అక్రమాల గురించి నిరూపిస్తే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఎన్నికల ప్రక్రియపై అనవసరంగా అనుమానాలు సృష్టించవద్దని అన్నారు.

మరోసారి వైకాపాకు భూస్థాపితమే!

జగన్‌ గారూ.. రాజకీయాల్లో శకునిలా కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోండి. ప్రజా సమస్యలపై మాట్లాడండి. మీ పాలనలో జరిగిన తప్పిదాలపై సమాధానం చెప్పండి. కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు, వ్యక్తిగత ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే ప్రచారాలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, మరో 24 గంటల్లో పురపాలక ఎన్నికల్లో వైకాపాను భూస్థాపితం చేసి, కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టడం ద్వారా తమ తీర్పు ఏమిటో స్పష్టం చేయనున్నారని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు.