-అన్నదాత సుఖీభవ సాయం మాత్రం భూ యజమానులకేనా? ఇది ఎక్కడి న్యాయం?
-భూమిలేని ప్రతి కౌలురైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలి
-ఎ. కాటమయ్య, పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 388 మండలాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుచేసిన పంటలు దెబ్బతిని కౌలురైతులు తీవ్రంగా నష్టపోయారని, మరోవైపు డెల్టా ప్రాంతంలో వరి, అరటి, కొబ్బరి, పసుపు తదితర పంటలు ఆర్నాబ్ తుఫాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిని కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. కాటమయ్య, పి. జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారిలో 90 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారని వారు పేర్కొన్నారు.
ఒకవైపు పెట్టుబడులు పెట్టి, అధిక కౌలు చెల్లించి, అప్పులు చేసి పంటలు సాగు చేసింది కౌలురైతులైతే, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదీ వారేనని తెలిపారు. కానీ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం మాత్రం సాగు చేయని భూయజమానులకు అందించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు.
అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద రూ.5,000 విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రెండో విడత కింద రూ.2,000 అందిస్తోంది. ఈ విధంగా ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలను భూమి కలిగిన వారికి అందిస్తున్న ప్రభుత్వాలు, వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలురైతులను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నాయి. పంటలు పండించని భూయజమానులకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, పంటలు పండించి నష్టపోయిన కౌలురైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వాల రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని వారు మండిపడ్డారు.
అన్నదాత సుఖీభవ పథకం ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కానీ వాస్తవ సాగుదారులైన కౌలురైతులను పక్కనపెట్టి, సాగుతో సంబంధం లేని భూయజమానులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడం వల్ల పథకం అసలు లక్ష్యమే దెబ్బతింటోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భూమి కలిగిన రైతులతోపాటు భూమిలేని కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా కౌలురైతులను మోసం చేస్తోంది.
2024–25లో ఈ పథకాన్ని అమలు చేయలేదు. 2025–26 నుంచి కేవలం సొంత భూమి కలిగిన రైతులకే ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం 2026–27లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ కౌలురైతులకు మొండిచేయి చూపుతోంది. గత రెండున్నర సంవత్సరాలుగా కౌలురైతులకు ఒక్క పైసా కూడా ఆర్థిక సహాయం అందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
ఇప్పటికే పెరిగిన కౌలు ధరలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ కూలీల ఖర్చులతో కౌలురైతులపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీనికి తోడు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఆర్నాబ్ తుఫాను, భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో వారు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వరి పంటకు 90 శాతానికి పైగా నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌలురైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి వాస్తవంగా పంటలు సాగుచేస్తున్న కౌలురైతులను గుర్తించాలని,
భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందించాలని,
వర్షాభావం, ఆర్నాబ్ తుఫాను, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన కౌలురైతులకు ప్రత్యేక పంట నష్టపరిహారం చెల్లించాలని
కౌలురైతులకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట రుణాలు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని
పంటలు సాగుచేసే వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని వారు డిమాండ్ చేసారు.
సాగు చేయని భూయజమానులకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ, పంటలు సాగుచేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కౌలురైతులను విస్మరించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని ఎ. కాటమయ్య, పి. జమలయ్య స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల ఆర్థిక సహాయం వెంటనే అందించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.
