-ఎలక్షన్ మెటీరియల్ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
-అధికారులకు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో, శనివారం నిర్వహించనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు.
గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల అధిపతులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది విధుల కేటాయింపు, రవాణా, ఇతర ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది, పోలింగ్ అధికారులు (పీఓలు), సహాయ పోలింగ్ అధికారులు (ఏపీఓలు), రిజర్వ్ సిబ్బంది సహా అందరూ శనివారం ఉదయం 7 గంటలకల్లా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం అయిన ఆంధ్రా ముస్లిం కళాశాలకు చేరుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకాని, గైర్హాజరైన సిబ్బందిపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అల్పాహారం, భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పీఓలు, ఏపీఓల కోసం ఏర్పాటు చేసిన వాహనాలు నిర్ణీత సమయానికి పంపిణీ కేంద్రానికి చేరుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ రోజున ఎలాంటి గందరగోళం తలెత్తకుండా శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులందరూ పాల్గొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు.
పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారులకు, సిబ్బందికి ఎలాంటి అయోమయం కలగకుండా పంపిణీ కేంద్రంలో స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, జి.రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, జి.సాంబశివరావు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలిషా, డీసీపీ సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
