పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు అక్టోబర్ 27, 28 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. గుంటూరులోని ఏ.సి. కాలేజీ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో సిబ్బంది తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం అక్టోబర్ 26వ తేదీన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది తమ ఓటర్ గుర్తింపు కార్డు మరియు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా, ఓటింగ్ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించేలా ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసినట్లు, పూర్తి వీడియోగ్రఫీ మరియు హెల్ప్ డెస్క్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పత్రాల ధ్రువీకరణ (అటెస్టేషన్) కోసం గెజిటెడ్ అధికారులు కూడా కేంద్రంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని కోరారు.