గుంటూరు స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు చేసే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రాంగణాన్ని పరిశీలించి చేపడుతున్న చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రిసెప్షన్ సెంటర్ కోసం సిద్దం చేసిన మ్యాప్ ని పరిశీలించి, ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లతో వాహనాలు వస్తాయని, వాటిని నిర్దేశిత మార్గంలో ట్రాఫిక్ సమస్య రాకుండా యూనివర్సిటీ ప్రాంగణంలోకి తీసుకురావడం, బ్యాలెట్ బాక్స్ లను క్రమ పద్దతిలో స్ట్రాంగ్ రూమ్ కి చేర్చడం కీలకమన్నారు. తదుపరి కౌంటింగ్ హాల్స్ ని పరిశీలించి, ఏజంట్లు, సిబ్బంది వేరువేరు మార్గాల్లో హాల్లోకి వచ్చేలా బ్యారీకేడింగ్ చేయాలని, ప్రతి హాల్లో సిసి కెమెరాలు ఫిక్స్ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. హాల్స్ లో లైటింగ్, ఫ్యాన్లు పక్కాగా ఉండేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన రోజు, కౌంటింగ్ రోజు సిబ్బందికి భోజన సదుపాయం సక్రమంగా అందేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జోనల్, రూట్ అధికారులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రం, అక్కడి నుండి రిసెప్షన్ సెంటర్ వరకు బ్యాలెట్ బాక్స్ లు చేరే వరకు భాధ్యత తీసుకోవాలని, నిర్దేశిత రూట్ లోనే వాహనాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, సర్వేయర్లు లక్ష్మీనారయణ, సుభాని పాల్గొన్నారు.