-గంటకు 125 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపు
-మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,010 కిలోమీటర్లు, బాపట్లకు 1,080 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈ తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయానికి తుపానుగా, బుధవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, అనంతరం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుపాను కదలికలు, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలను వేగంగా చేపట్టేందుకు ముందస్తుగా 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, బాపట్ల, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో ఈ బృందాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అవసరమైతే వినియోగించేందుకు మరికొన్ని బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి
తుపాను తీవ్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు, తీరప్రాంతాల్లోని మత్స్యకారులు అధికారుల సూచనలను పాటించాలని కోరింది. పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రంగా కట్టి ఉంచుకోవాలని సూచించింది.
తీరప్రాంతాల్లో ఎగసిపడే అలల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం, సముద్రాన్ని చూసేందుకు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం వంటివి చేయవద్దని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించకూడదని స్పష్టం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
మూడు రోజుల వాతావరణ పరిస్థితుల అంచనా
సోమవారం, అక్టోబర్ 26: రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం, అక్టోబర్ 27: విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం, అక్టోబర్ 28: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు.
తుపాను దిశ, తీవ్రతలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
