ఉప్పాడ మత్స్యకారులు, చేనేతలకు తుపాను నష్టపరిహారం త్వరగా అందించాలి: పవన్ కళ్యాణ్

-రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు, చేనేత కార్మికులకు తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని తుపాను బాధితుల సమస్యలను ప్రస్తావించారు.

అర్నబ్ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. యు.కొత్తపల్లి మండల పరిధిలోని ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని వివరించారు. బాధిత మత్స్యకారులకు తగిన పరిహారం త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో బోట్లు, వలలు, ఇతర చేపల వేట సామగ్రిని కోల్పోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అందించాలని ఆయన సూచించారు.

చేనేత కార్మికులకూ పరిహారం అందించాలి
తుపాను ప్రభావంతో ఉప్పాడ ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు చేరడం, విద్యుత్‌ లైన్లు తెగిపోవడం వల్ల చేనేత కార్మికుల జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలిగిందని తెలిపారు. నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి బాధిత చేనేత కార్మికులకు తగిన తుపాను పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

సహాయక చర్యలపై సీఎం పనితీరును ప్రశంసించిన పవన్
విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యలను పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో ప్రశంసించారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యమిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను సమన్వయంతో చేపట్టారని తెలిపారు.

తుపాను సహాయక చర్యల్లో భాగస్వాములైన మంత్రివర్గ సహచరులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు.