తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జీఎంసీ అప్రమత్తం

Gnt

-24 గంటల పాటు అందుబాటులో కంట్రోల్ రూమ్‌.. కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కంట్రోల్ రూమ్ నంబర్: 0863-2345103

లోతట్టు ప్రాంతాలు, డొంక రోడ్డులోని మూడు వంతెనలు, చుట్టుగుంట, కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సహాయ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.

రోడ్లపై చెట్లు, హోర్డింగులు కూలినట్లయితే వెంటనే తొలగించాలని, లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని ఆయన సూచించారు.