2027–28 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా కార్యక్రమాల రూపకల్పనపై రాష్ట్రస్థాయి సమావేశం

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా అవసరాలను గుర్తించి, 2027–28 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా కార్యక్రమాలను రూపొందించే లక్ష్యంతో సోమవారం మంగళగిరిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా అధ్యక్షత వహించారు.
మైసూరు ప్రాంతీయ విద్యా సంస్థ (RIE) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రద్యుమ్న కుమార్ సేథి, ప్రొఫెసర్ మల్లి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. SCERT సంచాలకులు ఎం. వెంకట కృష్ణారెడ్డి కార్యక్రమాలను సమన్వయం చేశారు.
ఈ సమావేశంలో SCERT, సమగ్ర శిక్ష, AP మోడల్ స్కూల్స్, గురుకులాలు, MJP పాఠశాలలు, గిరిజన సంక్షేమ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ విద్యా మండలి తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
2027–28 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, సమ్మిళిత విద్య, విద్యా సహాయక కార్యక్రమాల విస్తరణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, వనరుల వినియోగం, చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రతినిధులు తమ సూచనలు అందించారు.
వివిధ శాఖల సూచనల ఆధారంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన, సమాన అవకాశాలు కల్పించే విద్యా కార్యక్రమాల రూపకల్పనకు ఈ సమావేశం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.