-మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అనుమానితులకు స్క్రీనింగ్
-నెల్లూరు, కాకినాడ, విశాఖ ఓడరేవుల్లోనూ పరీక్షలు
-నవంబర్ 12న సన్నద్ధతపై మాక్ డ్రిల్
-కేంద్రానికి వివరించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు, పడకలు, వైద్య సిబ్బంది, అత్యవసర సామగ్రి, అనుమానిత కేసుల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తిరుపతి, భోగాపురం, విజయవాడ విమానాశ్రయాల్లో ఎబోలా అనుమానిత లక్షణాలున్న వారికి స్క్రీనింగ్ చేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధం చేశామని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఓడరేవుల్లోనూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సన్నద్ధతను పరీక్షించేందుకు నవంబర్ 12న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనుమానిత కేసుల గుర్తింపు, ఐసోలేషన్, వైద్య నిర్వహణ, రిఫరల్ విధానాల అమలుకు అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తామన్నారు.
### 21 రోజుల ప్రయాణ వివరాల పరిశీలన
ఎబోలా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అదనపు సంచాలకుడు డాక్టర్ హిమాన్షు చౌతా, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శుభా గార్గ్ (మైక్రో), ఇతర అధికారులు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
2026 అక్టోబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల వివరాలను వెల్లడించారు. కాంగో ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో 10,467 కేసులు, 5,103 మరణాలు; కెన్యాలో 9 కేసులు, 2 మరణాలు; ఉగాండాలో 20 కేసులు, 2 మరణాలు; నైజీరియాలో ఒక కేసు; ఫ్రాన్స్‌లో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తంగా ఐదు దేశాల్లో 10,498 నిర్ధారిత కేసులు, 5,107 మరణాలు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుత వ్యాప్తికి బుండిబుగ్యో వైరస్ రకం కారణమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికా వ్యాధి నియంత్రణ సంస్థ సూచించిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరీక్షలు, గత 21 రోజుల ప్రయాణ చరిత్రను తనిఖీ చేయాలని సూచించారు. లక్షణాలు లేని ప్రయాణికులను ఇంటి వద్ద స్వీయ పర్యవేక్షణలో ఉంచాలని, వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని 21 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచాలని తెలిపారు. అనుమానిత లక్షణాలున్న వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఐసోలేషన్ ఆసుపత్రికి తరలించాలన్నారు. విమాన ప్రయాణ సమయంలో లక్షణాలు కనిపిస్తే ప్రయాణికుడిని ఇతరుల నుంచి వేరు చేసి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
అనుమానిత నమూనాల పరీక్షలకు పుణెలోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో సదుపాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (ఎస్‌వీఐఎంఎస్) వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్, విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లలోనూ నమూనాల పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఆసుపత్రులు, పడకలు, కిట్లు, మాస్కులు సిద్ధం
ఎబోలా అనుమానిత కేసుల వైద్య నిర్వహణకు రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు కార్యదర్శి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు వివరించారు. మొత్తం 46 పడకలు, 3,288 పీపీఈ కిట్లు, 104 నమూనా సేకరణ కిట్లు, ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర అధికారులకు తెలిపారు.
సమీక్షలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ అట్టలూరి విష్ణువర్ధన్, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ ఆర్. వెంకట రమణ, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె. అర్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
