విజయవాడ నగరంలో కాలువల్లో గుర్రపు డెక్కలు, వ్యర్థాల తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో గుణదల, కార్మెల్ నగర్ ప్రాంతంలోని బుడమేరు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ, తుఫాను నేపథ్యంలో కాలువల్లో చేరిన గుర్రపు డెక్కలు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బందర్, ఏలూరు, రైవస్ కాలువల్లో సైతం లాంగ్ ఆర్మ్ ట్రాక్టర్ మిషన్లను వినియోగించి వ్యర్థాలను తొలగిస్తున్నామని, తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

గత రెండు రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోమల ఉత్పత్తిని నివారించేందుకు నీటి నిల్వ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు యాంటీ లార్వల్ ఆయిల్ స్ప్రే చేస్తున్నామని, నగర ప్రజలకు ఆరోగ్యకరమైన పరిసరాలను అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.