– పోలింగ్ నిర్వహణలో పోలీసులకు అండగా వాలంటీర్లు
– ఓటర్లకు అవసరమైన సహాయసహకారాలు అందించడంలో ప్రత్యేకత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. విజయవాడ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ మండలాలకు చెందిన 10 కళాశాలల నుంచి సుమారు 900 మంది విద్యార్థి వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల విధుల నిర్వహణలో తమ సేవలందించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు క్యూ లైన్ల నిర్వహణ, ఓటర్ల రాకపోకల క్రమబద్ధీకరణ, పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ పాటించేలా సహకరించారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు సహా సహాయం అవసరమైన ఓటర్లకు అవసరమైన సహకారం అందిస్తూ పోలింగ్ ప్రక్రియలో వారికి ఇబ్బందులు కలగకుండా తోడ్పడ్డారు. యువతలో సామాజిక బాధ్యత, సేవా భావం పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు స్వచ్ఛందంగా భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి బాధ్యతాయుతంగా సేవలందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు మార్గనిర్దేశనం చేయడంలో జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్ కీలకపాత్ర పోషించారు.
