-ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి – ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమికి చెందిన కార్పొరేటర్లు గురువారం భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి అభినందనలు తెలియజేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ, ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నించాలని అన్నారు.
కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి డివిజన్ల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), గడ్డం బాల వెంకట రవికుమార్, ఏలూరు సాయి శరత్, గుడిపాటి కిషోర్, పత్తి నాగేశ్వరరావు, కొండా జమలయ్య, బెవర జోగేశ్వరరావు, ఈగల సాంబశివరావు, అబ్దుల్ అకీబ్ అర్షద్, పెద్ది రమేష్, కొలగాని అశోక్, కే. శ్రీమణి జ్యోతి, గుర్రం కనకదుర్గ, కుంచం శ్యామల, శీలం స్వర్ణలత, గూడె లక్ష్మీ బసవ పూర్ణిమ, కిలారు నాగ శ్రావణ్, ఆవాల అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
