పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి….

-జడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి…

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, గృహ విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. గురువారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తుపాను కారణంగా విద్యుత్ శాఖకు జరిగిన నష్టం, చేపట్టిన పునరుద్ధరణ పనులు, ప్రస్తుత పరిస్థితుల వివరాలను వెల్లడించారు.

జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన 98 విద్యుత్ ఉపకేంద్రాల్లో పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రభావితమైన 67, 33 కేవీ విద్యుత్ లైన్లలో 65 లైన్లను పునరుద్ధరించగా, మిగిలిన రెండు లైన్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 475 ,11 కేవీ విద్యుత్ లైన్లలో 472 లైన్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన మూడు లైన్లను కూడా గురువారం సాయంత్రానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించడం, అధిక, అల్ప పీడన విద్యుత్ లైన్లపై పడిన చెట్లను తొలగించడం, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులను భారీ స్థాయిలో చేపట్టామన్నారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బందితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యుత్ సిబ్బంది కూడా పునరుద్ధరణ పనుల్లో పాల్గొని సేవలందించారని తెలిపారు.

జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ఆరు విభాగాలు, 20 మండలాల్లోని 409 గ్రామాల్లో గృహ విద్యుత్ సరఫరాను 100 శాతం పునరుద్ధరించినట్లు వెల్లడించారు. జిల్లాలో 17,584 ప్రభావిత ఆక్వా విద్యుత్ సర్వీసులకు గాను 14,595 సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, మిగిలిన 2,989 ఆక్వా సర్వీసులతో పాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు కూడా రానున్న ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 226 బృందాలకు చెందిన 3,254 మంది అధికారులు, విద్యుత్ సిబ్బంది నిరంతరం పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. తుపాను కారణంగా విద్యుత్ రంగానికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.50.49 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు, సమన్వయ చర్యల కారణంగా ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి గృహ విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారని సీఎండీ తెలిపారు. ప్రజలకు విద్యుత్ అంతరాయాల వల్ల కలిగిన ఇబ్బందులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేశారని అభినందించారు.

విద్యుత్ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:

– పశ్చిమగోదావరి జిల్లా కాల్ సెంటర్: 9490610152
– భీమవరం డివిజన్: 9493177646
– నరసాపురం డివిజన్: 7382050943
– తాడేపల్లిగూడెం డివిజన్: 9493177806

జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తితే పై నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని సీఎండీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ,అర్నబ్ తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పనిచేయడం వల్లే ఇంత తక్కువ సమయంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయడం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. తుపాను సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది చూపిన సమన్వయం, సమర్థవంతమైన పనితీరు అభినందనీయమని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, విద్యుత్ శాఖ డైరెక్టర్ సూర్య ప్రకాష్, ఎస్ఈ పి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.