-ప్రతి సోమవారం పంచారామాల యాత్ర – ప్రతి శనివారం వాడపల్లి పుణ్యక్షేత్ర యాత్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్ర దర్శన ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అందుబాటులోకి తీసుకువస్తోందని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (టూర్స్ & మార్కెటింగ్) టి. ఎస్. వీరనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సౌకర్యవంతంగా దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ఈ ప్రత్యేక యాత్రలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం పంచారామాల యాత్రను, ఏడాది పొడవునా ప్రతి శనివారం విజయవాడ–వాడపల్లి–విజయవాడ పుణ్యక్షేత్ర యాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలను ఏపీటీడీసీ 12 సీట్ల మినీ ఏసీ బస్సు ద్వారా నిర్వహించి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు వివరించారు.
పంచారామాల ప్రత్యేక ప్యాకేజీ
ఒకే రోజులో ఐదు పవిత్ర పంచారామ క్షేత్రాలను దర్శించుకునే ఈ ప్రత్యేక ప్యాకేజీలో
అమరలింగేశ్వర స్వామి ఆలయం (అమరావతి), కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం (సామర్లకోట), భీమేశ్వర స్వామి ఆలయం (ద్రాక్షారామం), క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం (పాలకొల్లు), సోమేశ్వర స్వామి ఆలయం (భీమవరం) దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ యాత్ర నవంబర్ 16, 23, 30 తేదీలతో పాటు డిసెంబర్ 7, న కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభమై, అదే రోజు రాత్రి సుమారు 10 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు.
ఈ ప్యాకేజీకి పెద్దలకు రూ. 2,370, పిల్లలకు రూ. 1,920 చార్జీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లు, భోజనం మరియు ఇతర వ్యక్తిగత ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతి శనివారం వాడపల్లి పుణ్యక్షేత్ర యాత్ర
విజయవాడ నుంచి వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం ఏడాది పొడవునా ప్రత్యేక ప్యాకేజీ నిర్వహిస్తున్నట్లు వీరనారాయణ తెలిపారు. ఈ యాత్ర ద్వారా భక్తులు అదే రోజు స్వామివారిని దర్శించుకొని తిరిగి విజయవాడ చేరుకునేలా రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్యాకేజీకి పెద్దలకు రూ. 1,350, పిల్లలకు రూ. 1,100 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. దర్శన టికెట్లు, భోజనం మరియు ఇతర వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని వివరించారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఇబ్బందులు లేని పుణ్యక్షేత్ర యాత్రలను అందించడమే ఏపీటీడీసీ లక్ష్యమని టి. ఎస్. వీరనారాయణ, జనరల్ మేనేజర్ (టూర్స్ & మార్కెటింగ్) తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఈ ప్రత్యేక ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (టూర్స్ & మార్కెటింగ్) టి. ఎస్. వీరనారాయణ ఆ ప్రకటనలో తెలిపారు.
