– ప్రక్రియ విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 7వ తేదీన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో తదుపరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు నిర్వహణకు సంబంధించి మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు సంబంధించి మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
