జాతీయ సరస్ మేళాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

-వినియోగదారులు, విక్రయదారులతో ముఖాముఖి అభిప్రాయాల సేకరణ
-సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంల పనితీరు పరిశీలన

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. మేళా ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను సందర్శించి, దేశవ్యాప్తంగా వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తుల కళాకారులు ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల తయారీ విధానం, నాణ్యత, ధరలు, విక్రయాల వివరాలను స్టాళ్ల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
వినియోగదారులు, విక్రయదారులతో ముఖాముఖి గా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినియోగదారులు, విక్రయదారులతో ముఖాముఖి నిర్వహించి, ఉత్పత్తుల నాణ్యత, ధరలు, విక్రయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మేళాలో పాల్గొన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు తగిన వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయా, విక్రయాలు ఏ విధంగా సాగుతున్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు, వారి నైపుణ్యానికి తగిన గుర్తింపు, ఆర్థిక స్వావలంబన లభించేందుకు జాతీయ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

మొబైల్ ఏటీఎంల పరిశీలన

మేళాకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న సందర్శకులకు నగదు లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వాహనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వాటి పనితీరును సమీక్షించి, సందర్శకులకు నిరంతర సేవలు అందేలా చూడాలని, నగదు ఉపసంహరణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత బ్యాంకు అధికారులకు సూచించారు.

సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

మేళా ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లు, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలు, చేతివృత్తుల కళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో జాతీయ సరస్ మేళాను సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మహిళా సంఘాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

కలెక్టర్ పరిశీలనలో ఎన్టీఆర్ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచార రావు, సెర్ప్ (అడ్మిన్) డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.