గ్రూప్‌–2 అభ్యర్థులకు తెలుగు అకాడమీ పుస్తకాల బహుకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో గ్రూప్‌–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జి. శశిరేఖ (E.E., R&B) సహకారంతో తెలుగు అకాడమీ పుస్తకాలను బహుకరించారు.
గ్రూప్‌–2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే తెలుగు అకాడమీ పుస్తకాలు అవసరమని విద్యార్థులు గ్రంథాలయ అధికారులను కోరారు. ఈ విషయాన్ని గ్రంథాలయ అధికారి కే. రమాదేవి, శశిరేఖ మేడమ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించారు. తాను బిజీగా ఉన్నందున విద్యార్థులే వెళ్లి వారికి అవసరమైన పుస్తకాలను తెచ్చుకోవాలని, వాటికి సంబంధించిన డబ్బులు తాను ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తమకు ఉపయోగపడే తెలుగు అకాడమీ పుస్తకాలను తెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి కే. రమాదేవి మాట్లాడుతూ, విద్యార్థులకు సరైన సమయంలో పుస్తకాలు అందించేందుకు సహకరించిన శశిరేఖ కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
పుస్తకాలు అందడంతో విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ శశిరేఖ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో పాటు గ్రంథాలయ సిబ్బంది ధనలక్ష్మి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.