నిర్దేశిత గడువులోగా నగర అభివృద్ధి పనులు పూర్తి చేయాలి…

-అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ కే. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శంకర్ విలాస్ ఆర్‌ఓబీ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్‌–3, మిర్చి యార్డు సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం, అమృత్‌ 2.0 పథకం కింద గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, బీఆర్ స్టేడియం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అభివృద్ధి, నందివెలుగు రోడ్డు ఆర్‌ఓబీ నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులు, జీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు భవిష్యత్తులో గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తాయని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పనికి నిర్దిష్ట కాలపరిమితి విధించుకొని పురోగతి సాధించాలని ఆదేశించారు.
శంకర్ విలాస్ ఆర్‌ఓబీ పనులపై సమీక్ష
శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణం, సర్వీస్ రోడ్డు ఏర్పాటు పనులను కూడా చేపట్టాలని సూచించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్‌–3
ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్‌–3 నిర్మాణ పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. విద్యుత్ స్తంభాల మార్పిడి, సెంట్రల్ డివైడర్ నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పలకలూరు నుంచి అనుసంధానమయ్యే అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమృత్‌ 2.0 పనులు వేగవంతం చేయాలి
అమృత్‌ 2.0 పథకం కింద రూరల్ ప్రాంతాల్లో మంజూరైన ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ప్రధాన పైప్‌లైన్ పనులకు సంబంధించిన మ్యాప్‌లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే యాదవ డొంక అభివృద్ధికి ఆర్‌డీపీ సిద్ధం చేయాలని, పోలిశెట్టికుంట నుంచి జొన్నలగడ్డ రోడ్డు అభివృద్ధికి కూడా ఆర్‌డీపీ తయారు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు.
మిర్చి యార్డు ఫ్లైఓవర్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
మిర్చి యార్డు సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బీఆర్ స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
బీఆర్ స్టేడియంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన కమిషనర్, అక్కడ అభివృద్ధి చేస్తున్న వివిధ క్రీడా కోర్టులు, ప్లే గ్రౌండ్లు, జిమ్, బాక్సింగ్ తదితర సదుపాయాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల వేగవంతానికి నగరపాలక సంస్థ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
నందివెలుగు రోడ్డు ఆర్‌ఓబీ పనులపై సమన్వయం
నందివెలుగు రోడ్డు ఆర్‌ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ అధికారులు, జీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశాల్లో ఆర్‌డీఓ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, జీఎంసీ ఎస్‌ఈ జి. వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు, డీఎస్‌డీఓ, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులు, జీఎంసీ ఈఈలు, రైల్వే అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ ఏఈ, ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.