-భక్తుల సేవలకు మొబైల్ యాప్- పనుల పురోగతికి డాష్ బోర్డు
-రాజమహేంద్రవరంలో సూర్య భగవానుడు, బృహస్పతి ఆలయం
-వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి పుష్కర పనులు పూర్తి కావాలి
-2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గోదావరి పుష్కరాల నిర్వహణకు చేపడుతున్న పనులు ఆయా జిల్లాలకు శాశ్వత ఆస్తిగా మిగలాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు పనుల నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ వద్దని సీఎం తేల్చి చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 10 నుంచి 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలకు వస్తారన్న అంచనాల నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ మహాపర్వానికి దేశ విదేశాల నుంచి కోట్లమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రవాణా, భద్రత, వైద్య సేవలు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. 22 ప్రభుత్వ శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులను ప్రతిపాదించామని వివరించారు. వీటిలో ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలను నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు, ఇతర సంస్థలను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు. పుష్కర విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అన్ని శాఖలు జిల్లాల వారీగా పనుల పురోగతి, నిధుల వినియోగ వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పుష్కరాలు నిర్వహించే జిల్లాల్లో చేపడుతున్న పనులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశంగా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు గోదావరి పుష్కరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత చాటేలా రాజమహేంద్రవరం లో రూ.1.80 కోట్లతో సూర్య భగవానుడు, బృహస్పతికి ఆలయం నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. పుష్కరాల ప్రత్యేకత, గోదావరి నది గొప్పతనాన్ని చాటేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పుష్కరాల నిర్వహణకు ప్రజల నుంచి మంచి పేరు సూచనలు స్వీకరించడంతో పాటు ప్రత్యేక ప్రచార గీతాలను రూపొందించాలని చెప్పారు. గోదావరి నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన, భారీ దీపాలంకరణ, గోదావరి ముగ్గు, సామూహిక యోగా వంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
ఘాట్లలో మౌలిక సదుపాయాల కల్పన
ఇంకా పుష్కరాలకు 217 రోజుల సమయమే ఉన్నందున పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 440 ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాదాపు రూ.649.70 కోట్ల విలువైన 659 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే రూ.25.53 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్టు తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, తాగునీరు, లైటింగ్ తదితర అవసరాల కోసం రూ.464 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు వివరించారు. వైదిక ఆచారాలకు అనుగుణంగా ఘాట్ల అభివృద్ధి, భక్తుల వసతి, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు 268.12 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రూ.300 కోట్లతో 78 రహదారుల అభివృద్ధి పనులు చేపట్టగా..2027 ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు, కొవ్వూరు నుంచి ధవళేశ్వరం వరకు, పోలవరం లెఫ్ట్ బండ్‌పై రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు.
4 వేల ప్రత్యేక బస్సులు.. 1,560 రైళ్లు
భక్తుల రవాణా అవసరాల కోసం 4,000 ప్రత్యేక బస్సులు, 649 గ్రీన్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పుష్కరాల సమయంలో 1,560 ప్రత్యేక రైల్వే సర్వీసులు నిర్వహించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ ఫారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. పుష్కరాలు జరిగే జిల్లాల్లో ప్రత్యేక సబ్సిడీతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చూడాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులను ఆకట్టుకునేలా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం విమానాశ్రయాలను సుందరీకరించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు 135 భాషల్లో సమాచారం అందించేలా ఏఐ ఆధారిత చాట్‌బాట్ వ్యవస్థతో పాటు వర్చువల్ రియాలిటీ, డిజిటల్ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మహా కుంభమేళా నిర్వహణలో అనుసరించిన మెరుగైన విధానాలను అధ్యయనం చేసి గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేయాలని సీఎం సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారం, రవాణా, వసతి, ఘాట్లు, వైద్య సేవల వివరాలు సులభంగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు.
పోలవరం లెఫ్ట్ బండ్ పై రహదారి నిర్మాణం
పుష్కరాల సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంబులెన్సులు, వైద్య బృందాలు, అత్యవసర చికిత్సా కేంద్రాలను కూడా నియమించేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సేవలను సమన్వయం చేసుకోవడంతో పాటు మొబైల్ ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు. భక్తులు తాగునీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పుష్కరాలకు ముందే పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాజమహేంద్రవరం–పోలవరం మధ్య 40 కిలోమీటర్ల జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్ నెలలో సాధారణంగా గోదావరిలో ఉండే నీటి ప్రవాహాలపై ముందుగానే అంచనాలు రూపొందించి, అందుకు అనుగుణంగా ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, గోదావరి జలాల పవిత్రత కాపాడటం, పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పుష్కరాలు జరిగే జిల్లాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ రూపొందించి ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
