ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి: దేవినేని ఉమా

-స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
-పొన్నవరంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న కూటమి అభ్యర్థులకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి దేవినేని ఉమా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. విద్యావంతులు, ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన అభ్యర్థులను కూటమి ప్రజల ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. వీరులపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న నిమ్మల రాజశేఖర్‌కు గాజు గ్లాసు గుర్తుపై, పొన్నవరం ఎంపీటీసీ అభ్యర్థి చోడగిరి సంధ్యకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ‘చెప్పాం… చేస్తున్నాం… చేస్తాం’ అనే నినాదంతో కూటమి అభ్యర్థులు ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని, ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే స్థానిక ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 11 సీట్లకే పరిమితమైందని దేవినేని ఉమా విమర్శించారు. అయినప్పటికీ వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు సంపూర్ణంగా కూటమి వైపే ఉందని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.