-నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అపోహలను నమ్మవద్దు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ముంచుకొస్తున్న ‘మురసు’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల దృష్ట్యా, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం సాయంత్రం బుడమేరు పరివాహక ప్రాంతంలోని గూడవల్లి, ఎనికేపాడు ప్రాంతాలలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బుడమేరు ప్రవాహ తీరును, గట్లను, క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరినా ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు కలగకుండా తూములు, వంతెనల వద్ద గుర్రపుడెక్క, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. బలహీనంగా ఉన్న కరకట్టల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గేంతవరకు బుడమేరు లోతట్టు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే గమనించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అపోహలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర సమాచారం ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్.91549 70454 కు సమాచారం అందించాలని తెలిపారు.
కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ బి.సుగుణ, ఇరిగేషన్ డిఈ కె.బాబు, జెఈ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.
