-అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని, అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. ప్రచార వాహనాల వివరాలను సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో కార్యాలయంలో సమర్పించి అనుమతి తీసుకోవాలని, అసలు అనుమతి పత్రాన్ని వాహనం ముందు అద్దంపై స్పష్టంగా కనిపించేలా ఉంచాలని తెలిపారు. పోలింగ్ రోజున జడ్పీటీసీ అభ్యర్థికి రెండు వాహనాలు, ఎంపీటీసీ అభ్యర్థికి ఒక వాహనం మాత్రమే ప్రత్యేక అనుమతితో వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఓటర్లను తరలించేందుకు వాహనాలను ఉపయోగించడం నేరమని హెచ్చరించారు.
లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి వాటి వినియోగం పూర్తిగా నిషేధమని తెలిపారు. వాహనాలపై మైకులు ఏర్పాటు చేసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల ప్రాంగణాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడరాతలు, కటౌట్లు ఏర్పాటు చేయరాదని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ స్థలాలు, భవనాలపై ప్రచార సామగ్రి ఏర్పాటు చేయాలంటే యజమానుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని, సంబంధిత ఖర్చుల వివరాలను మూడు రోజుల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించి ఎన్నికల వ్యయంలో నమోదు చేయాలని పేర్కొన్నారు.
ప్రచార కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు, చిరునామాలు తప్పనిసరిగా ముద్రించాలని, సంబంధిత డిక్లరేషన్ ఫారాలు (Annexure A & B) సమర్పించాలని తెలిపారు. కులం, మతం, జాతి, భాష ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడరాదని హెచ్చరించారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం నిషిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాలు, సిబ్బంది, వనరులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదన్నారు. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని, స్థానికేతర రాజకీయ ప్రతినిధులు నియోజకవర్గాలను విడిచివెళ్లాలని సూచించారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్లు, రసీదులు, వోచర్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ఎంపీడీవో ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి వ్యయ ఖాతాలను సమర్పించాలని, గడువులోగా సమర్పించని వారిపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళిని, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994ను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
