77, 79, 80వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి ప్రచార హోరు

-ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 77, 79, 80వ డివిజన్లలో మంగళవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
77వ డివిజన్‌లోని సింగ్‌నగర్ డాబా కొట్లు సెంటర్‌ నుంచి ప్రారంభమైన ప్రచారం లూనా సెంటర్, చల్లగాలి ఐజయ్య రోడ్డు, 19బి రోడ్డు మీదుగా సాగింది. అనంతరం 79వ డివిజన్‌లోని లెనిన్ సెంటర్, మసీదు రోడ్డు, ఎం.కె. బేగ్ స్కూల్ వెనుక రోడ్డు, యార్డ్ రోడ్డు మీదుగా కొనసాగి, 80వ డివిజన్‌లోని సి-బ్లాక్‌లో ముగిసింది. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, సంక్షేమ పథకాలను అర్హులకు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని వివరించారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
వాంబే కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా: బెవర సూర్యామణి
80వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణి మాట్లాడుతూ వాంబే కాలనీలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి సమస్యల పరిష్కారంతో పాటు డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తానని పేర్కొంటూ, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.