బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రేపు ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం, సోమవారాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరవచ్చని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు

శుక్రవారం (అక్టోబర్ 23) మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి వర్షాలు పడవచ్చని వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు అంతకంటే ముందే తీరానికి తిరిగి రావాలని హెచ్చరించారు.