మురాసు తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి…

-ప్రజల భద్రతకు పటిష్టమైన ముందస్తు చర్యలు.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
-అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు: నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ (Murasu) తుపాను ప్రభావంతో రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్ అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ కమిషనర్ సూచించారు.

పోలీస్ శాఖ సూచనలు
అత్యవసరమైతేనే బయటకు రావాలి: భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, కాలువలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దు.
చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్త: బలమైన గాలుల కారణంగా చెట్లు విరిగిపడటం, విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. పాత బహుళ అంతస్తుల భవనాలు, భారీ ప్రకటనల హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద వాహనాలను నిలపవద్దు. వాటి సమీపంలో నిలబడవద్దు.
వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి: వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనాల వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలి.
సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి: కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పూరిళ్లలో నివసిస్తున్న ప్రజలు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.

అత్యవసర సహాయక చర్యలకు పోలీస్ బృందాలు సిద్ధం
తుపాను అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలు (SDRF) కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ శాఖ నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది.

పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ మరియు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు కోరారు.

ప్రజలందరూ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, తుపాను సమయంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.