-13 జిల్లాల్లో 724 వైద్య బృందాలు.. 4,628 అత్యవసర పడకలు సిద్ధం
-3,066 మంది గర్భిణుల్లో 1,103 మంది ఆస్పత్రులకు తరలింపు
-అంబులెన్స్ సేవలు ఆర్టీజీఎస్తో అనుసంధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుపాను నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రభావితమయ్యే అవకాశం ఉన్న 13 జిల్లాల్లో 724 వైద్య బృందాలు, 4,628 అత్యవసర పడకలు, 205 సహాయ శిబిరాలను సిద్ధం చేసింది. 866 ప్రభుత్వ వైద్యశాలల్లో 398 వైద్యశాలలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. 359 అంబులెన్సులు (108), 128 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు (102), 320 సంచార వైద్య వాహనాలు (104) అందుబాటులో ఉంచారు. అంబులెన్స్ సేవలను ఆర్టీజీఎస్ పోర్టల్‌తో అనుసంధానించారు. సుమారు 300 ప్రైవేటు అంబులెన్సులను కూడా ఆర్టీజీఎస్ పోర్టల్‌తో అనుసంధానించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) ద్వారా అంబులెన్సుల వివరాలను ఒకే డిజిటల్ వేదికపై పర్యవేక్షిస్తారు. తుపాను సమయంలో అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడంతో పాటు, అవసరమైన ప్రాంతాలకు అంబులెన్సులను సమర్థంగా కేటాయించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అంటువ్యాధుల నిఘా కేంద్రాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
### గర్భిణుల భద్రతకు ముందస్తు చర్యలు
నవంబర్ 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రసవ గడువు ఉన్న 3,066 మంది గర్భిణులను గుర్తించగా, 1,103 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారిని అవసరాన్ని బట్టి ముందుగానే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి నివాస ప్రాంతాలను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవ సదుపాయాలు కల్పిస్తున్నారు.
వైద్య సదుపాయాలు సిద్ధం
తీర ప్రాంతాల్లోని 121 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. పాముకాటు నివారణకు 15,161 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. 848 వైద్యశాలల్లో జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. నీరు, దోమలు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నీటి శుద్ధికి క్లోరిన్ మాత్రలను సిద్ధం చేశారు. సురక్షిత తాగునీటి సరఫరాకు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక శాఖలతో సమన్వయం చేస్తున్నారు. ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
తుపాను సన్నద్ధతకు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను అధికారులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు.
