-230కి పైగా ఉద్యోగాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఉయ్యూరులోని డి.పి. ఫౌండేషన్ సొసైటీ – DDUGKY శిక్షణ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి. నరేష్ కుమార్ వెల్లడించారు. మొత్తం 230కి పైగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువత ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రెజ్యూమె, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకురావాలని కోరారు.
మరిన్ని వివరాలకు 96767 08041, 84648 53703, 92476 00551 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
