-డిసెంబర్ 31లోపు నమోదు చేసుకోవాలి – జిల్లా ఉద్యాన శాఖ అధికారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి జిల్లాలో మామిడి సాగు చేస్తున్న రైతులు ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత పొందేందుకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద బీమా చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు. 2026-27 రబీ సీజన్‌కు మామిడి పంటను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ పథకం కింద ఎకరానికి రూ.35,000 బీమా మొత్తం ఉండగా, రైతులు రూ.1,750 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీమా నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 31, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
రైతులు బీమా నమోదు చేసుకునే ముందు తమ మామిడి తోటలకు సంబంధించిన అన్ని సర్వే నంబర్లను ఈ-పంటలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, భూమి రికార్డులు, పంట వివరాలతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), బ్యాంకులు లేదా అధీకృత బీమా ప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. PMFBY పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
జిల్లాలోని మామిడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోగా పంట బీమా నమోదు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ కోరింది.
