వైద్య విద్యను వ్యాపారంగా మార్చొద్దు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య విద్యను లాభాల ఆర్జనకు వేదికగా మార్చుకుంటున్న ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అక్రమాలు, ప్రమాణాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సమగ్ర విచారణ జరపాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కాగితాలపై అధ్యాపకులను చూపించడం, తనిఖీల సమయంలో తాత్కాలికంగా రోగులను సమీకరించడం, విద్యార్థులకు తగిన క్లినికల్ శిక్షణ అందించకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, ఇంటర్న్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ల చెల్లింపుల్లో అక్రమాల ఆరోపణలను తీవ్రంగా పరిశీలించాలని కోరారు.
NMC తనిఖీలు పారదర్శకంగా, ఆకస్మికంగా నిర్వహించి, నివేదికలను బహిర్గతం చేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకుల హాజరు, ఆసుపత్రుల OP, IP రికార్డులు, విద్యార్థులకు అందుతున్న శిక్షణ, ఫీజుల వసూళ్లు, స్టైపెండ్ చెల్లింపులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కొత్త వైద్య కళాశాలలకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు వైద్యుల నైపుణ్యం, ప్రజల ప్రాణాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించరాదని గుజ్జుల ఈశ్వరయ్య ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.