-యువతకు రూ.20 లక్షల వరకు రుణాలు.. అర్చకులకు రూ.15 వేల కనీస వేతనం: బుచ్చి రామ్ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: బ్రాహ్మణ సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు.
ఆదివారం చిన్న కంచి నున్నలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రాహ్మణ యువతకు ఖాదీ బోర్డు పథకాల ద్వారా అర్హతలు, నిబంధనల మేరకు రూ.20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు.
అర్చకులకు కనీసం రూ.15 వేల వేతనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవాలయ నిర్మాణాలకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు సహాయం పొందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సుమారు 5 వేల దేవాలయాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేవాలయ పాలక మండళ్లలో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశీ విద్య అభ్యసించాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులకు రుణ సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తామని చెప్పారు.
బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సమాజ సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
