శ్రీకాకుళం ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలి

-స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి.. ప్రతి ఓటరును కలవాలి
-కూటమి పార్టీల ఐక్యతతోనే మంచి ఫలితాలు: మంత్రి నాదెండ్ల మనోహర్

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ నెల 26న జరగనున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో, అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, సఖ్యత ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.

కేవలం గెలుపు లెక్కలపై ఆధారపడకుండా ప్రతి ఓటరును కలిసి వారి ఇబ్బందులను తెలుసుకోవాలని, వెంటనే పరిష్కరించగల సమస్యలపై తక్షణమే స్పందించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నగర అభివృద్ధికి చేపట్టబోయే పనులపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతురాలైన డాక్టర్ దానేటి రాధారాణి గెలుపుతో శ్రీకాకుళం నగర అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించాలని కోరారు.

హోరెత్తిన కూటమి ప్రచార ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించిన కూటమి నాయకుల ర్యాలీలో నాదెండ్ల మనోహర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, లోకం మాధవి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్ టి. శివశంకర్, సూదా చైర్మన్ కొరికాన రవికుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.