గొల్లపూడిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి జయంత్ సాయి విస్తృత ప్రచారం

-ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన బొమ్మసాని జయంత్ సాయి

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గొల్లపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మసాని జయంత్ సాయి ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో తనతో పాటు తన బృందంలోని వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం సాయంత్రం వార్డు సభ్యుల అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎస్సీ కాలనీతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా బొమ్మసాని జయంత్ సాయి మాట్లాడుతూ, తన తాత బొమ్మసాని కృష్ణమూర్తి, తండ్రి బొమ్మసాని సుబ్బారావు గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించారని తెలిపారు. వారి వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన తాత, తండ్రి సంపాదించిన మంచి పేరుకు ఏమాత్రం భంగం కలగకుండా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
తనకు కేటాయించిన కత్తెర గుర్తుతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులందరినీ గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. తమను ఆదరించి ఓటు వేయనున్న గ్రామ ప్రజలకు ముందస్తుగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.