అమరావతి క్వాంటం వ్యాలీలో సరికొత్త అధ్యాయం

-రాష్ట్రానికి ‘నీలిట్’ డీమ్డ్ టు బి యూనివర్సిటీ
-ప్రపంచలోనే తొలి క్వాంటం, ఏఐ వర్సిటీ ప్రత్యేక క్యాంపస్‌
-ఆచార్య నాగార్జునలో తాత్కాలిక తరగతులు ప్రారంభం
-త్వరలో రూ.730 కోట్లతో రాజధానిలో శాశ్వత క్యాంపస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అమరావతి తాత్కాలిక క్యాంపస్‌ను శనివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) క్యాంపస్‌లోని సీడీఈ భవనంలో ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ ఎ. ప్రతిభ ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొలి విశ్వవిద్యాలయ క్యాంపస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో అమరావతిలో నీలిట్ ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీలో నైపుణ్యాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా నిలవడంతో పాటు, అత్యాధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన నిపుణులను తయారు చేయనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తద్వారా కొత్త భవనాల నిర్మాణం కోసం వేచి చూడకుండా రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, శిక్షణ వెంటనే అందుబాటులోకి వచ్చింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో క్యాంపస్

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థ నీలిట్‌కు ‘ఇన్‌స్టిట్యూషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (డిస్టింక్ట్ కేటగిరీ)’ హోదా లభించింది. కేంద్ర పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం ఇదే. పంజాబ్‌లోని రూపార్‌లో ప్రధాన క్యాంపస్ ఉండగా, దేశవ్యాప్తంగా 11 అనుబంధ క్యాంపస్‌లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేగవంతమైన భాగస్వామ్యంతో అమరావతి క్యాంపస్ ఏర్పాటు సాధ్యమైంది. 2026 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీలిట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తొమ్మిది నెలల్లోనే క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో భాగంగా తాత్కాలిక క్యాంపస్‌లో రూ.47 కోట్ల వ్యయంతో నాలుగు అత్యాధునిక ప్రయోగశాలలను నీలిట్ ఏర్పాటు చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్, క్వాంటం కమ్యూనికేషన్ ల్యాబ్, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ ల్యాబ్, AI, కంప్యూటింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ప్రయోగశాలల ద్వారా ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. వీటి ద్వారా విద్యార్థులకు ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం కల్పిస్తారు. క్వాంటం, AI, అనుబంధ సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా తాత్కాలిక క్యాంపస్‌లో వివిధ కోర్సులను వచ్చే జనవరి నుంచి ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌తో పాటు, తరగతి గదిలోనూ శిక్షణ అందిస్తారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధి కలిగిన పది అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నారు. వీటిలో క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సైన్స్, ఇంజినీరింగ్‌లో ఏఐ వినియోగం, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్…వీటితో పాటు ప్రాచుర్యం పొందిన ‘O’ లెవెల్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తారు. అదనంగా 16 స్వల్పకాలిక కోర్సులను అందించనున్నారు. వీటిలో VLSI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చైన్, సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ (ATMP), క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో బోధించే అధ్యాపకులకు ఈ నైపుణ్యాలను అందించేందుకు పది విభాగాల్లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

అమరావతిలో 8.5 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అమరావతిలో నీలిట్ శాశ్వత క్యాంపస్‌ను రూ.730.70 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపారు. ఇందుకోసం అమరావతిలోని నిడమర్రు వద్ద 8.5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ క్యాంపస్ ద్వారా సుమారు 8,250 మందికి శిక్షణ అందించాలన్నది లక్ష్యం. ఇందులో సుమారు 1,650 మందికి డిగ్రీ కోర్సుల ద్వారా, మరో 6,600 మందికి నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా శిక్షణ కల్పిస్తారు. భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించగా, భవనాల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులను నీలిట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భరించనున్నాయి. క్వాంటం టెక్నాలజీ, AI, సెమీకండక్టర్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, డిప్లొమా కోర్సులను అందించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలోని ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌పై పనిచేసే అరుదైన అవకాశం కూడా ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులకు లభించనుంది. శాశ్వత క్యాంపస్ సిద్ధమైన వెంటనే ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రయోగశాలలు, అధ్యాపకులు, విద్యార్థులను ఎలాంటి అంతరాయం లేకుండా కొత్త క్యాంపస్‌కు తరలిస్తారు. అమరావతితో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ నీలిట్ కార్యకలాపాలను విస్తరించనున్నారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తాత్కాలిక వసతి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న NIELIT తిరుపతిని సొంత శాశ్వత క్యాంపస్‌కు తరలించనున్నారు. ఈ మేరకు మూడు ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనను సమర్పించగా, ఎస్వీ విశ్వవిద్యాలయం ఇప్పటికే ఎన్వోసీ జారీ చేసింది. తిరుపతి క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని వివిధ వర్గాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అధ్యాపకులు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో పెట్టుబడులకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఎదగనుంది. నీలిట్ క్యాంపస్ ద్వారా శిక్షణ పొందిన నిపుణులు, పరిశోధకులు అమరావతి క్వాంటం వ్యాలీ వ్యవస్థలో భాగస్వాములు కానున్నారు. దీంతో భారతదేశంలో క్వాంటం టెక్నాలజీకి ప్రముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలోపేతం కానుంది. జాతీయ క్వాంటం మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నీలిట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభంతో అత్యాధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన సంపూర్ణ నైపుణ్య వ్యవస్థకు పునాది పడింది. నేటి ఉద్యోగావకాశాలకే కాకుండా, భవిష్యత్తులో ఆవిర్భవించనున్న పరిశ్రమలకు కూడా రాష్ట్ర యువతను సిద్ధం చేయడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించనుంది.