రాయచోటిలో కూటమిది చారిత్రాత్మక విజయం

-ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు
-44 మున్సిపల్ స్థానాలు.. 67 ఎంపీటీసీ స్థానాలు కూటమి కైవసం
-ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలు సొంతం
-వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి
-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. అభివృద్ధిని కొనసాగిస్తాం
-రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తున్నారని, ముఖ్యంగా రాయలసీమలో కూటమికి అనూహ్య ప్రజాదరణ లభించిందని తెలిపారు. ఈ విజయం కేవలం కూటమి ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజల విజయమని అభివర్ణించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలకు, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్నారు.

రాయచోటి రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం

రాయచోటి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కూటమి సాధించిన విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి అన్నారు. రాయచోటి మున్సిపాలిటీలోని 44 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. 2005లో మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశామని పేర్కొన్నారు.

అదేవిధంగా రాయచోటి నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని చెప్పారు. వీటిలో 66 స్థానాలు ముందుగానే ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక స్థానంలోనూ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారని వివరించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీ స్థానాలను సైతం కైవసం చేసుకున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని, రాయచోటి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలతో విజయం సాధించామని పేర్కొన్నారు.

వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయచోటి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.గత ప్రభుత్వ హయాంలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేపడుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే కూటమికి పెద్దఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు.

రాయచోటి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖకు అవసరమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వివరించారు.

రాయచోటి పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వెలిగల్లు జలాశయం నుంచి రెండో దశ నీటి సరఫరా పథకానికి రూ.119 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా 850 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతుల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఇప్పటివరకు 1,200 ట్రాన్స్‌ఫార్మర్లు అందించినట్లు వివరించారు.

రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.36 కోట్ల నిధులు తీసుకొచ్చామని, పట్టణంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మించి రాయచోటిని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

వైద్య, విద్యా రంగాలకు పెద్దపీట

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 10 డయాలసిస్ యూనిట్ల సంఖ్యను 25కు పెంచుతున్నట్లు చెప్పారు. తద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి రూ.35 కోట్లతో పాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు

రాయచోటి పట్టణంలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, దాతల సహకారంతో రెండు క్యాంటీన్లలోనూ పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మానవతా దృక్పథంతో నిరుపేదలు, కార్మికులు, ఇతర అవసరార్థులకు ఆహార సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.48 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

కార్యకర్తల కష్టాన్ని మరువం

కూటమి విజయానికి అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కులమతాలకు అతీతంగా సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.