-అర్హులైన ఓటర్లు నవంబర్ 30న ప్రచురించే తుది జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
-గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, ద్వంద్వ నమోదైన ఓటర్లకు అవకాశం
-బీఎల్ఓల ద్వారా పాక్షికంగా పూరించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
-ఈసీఐనెట్ ద్వారా కూడా ఫారాలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఎ.ఎస్.డి.డి. (గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, ద్వంద్వ నమోదైనవారు) కేటగిరీల కింద పేర్లు తొలగించబడిన అర్హులైన ఓటర్లకు నవంబర్ 30న ప్రచురించే తుది జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఎ.ఎస్.డి.డి. ఓటర్ల జాబితాలు పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఈఆర్వో కార్యాలయాలతో పాటు సంబంధిత వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బీఎల్ఓల ద్వారా పాక్షికంగా పూరించిన ఫారాలు పంపిణీ చేస్తారని, పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఈసీఐనెట్ (ECINET) ద్వారా కూడా ఫారాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నివాసం మారని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం-బి (Annexure-B) డిక్లరేషన్ను పూరించి బీఎల్ఓ లేదా ఈఆర్వోకు సమర్పించాలని, లేదా ఆన్లైన్లో అందజేయవచ్చన్నారు. రాష్ట్రంలోనే నివాసం మార్చినవారు ఫారం-8 అవసరం లేకుండా ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం-సి (Annexure-C), కొత్త చిరునామా ధ్రువీకరణ పత్రాలను నూతన నియోజకవర్గ ఈఆర్వో లేదా ఏఈఆర్వోకు సమర్పించాలని సూచించారు. నిరాశ్రయుల విషయంలో బీఎల్ఓ విచారణ నివేదికనే ధ్రువీకరణగా పరిగణిస్తారని తెలిపారు.
ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, దరఖాస్తు ఆమోదం పొందితే పాత ఎపిక్ నంబరే కేటాయించబడుతుందని కలెక్టర్ వివరించారు.
అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించి, నవంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదయ్యేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కోరారు.
