అభ్యర్థుల నామినేషన్ల అడ్డగింతలు ప్రజాస్వామ్య హక్కులపై దాడి

-ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలి : ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న దాడి ఘటనలను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నాయకులు, కార్యకర్తలు పోలీసుల సహకారంతో దాడికి పాల్పడ్డారని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం, నామినేషన్ దాఖలు చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులని స్పష్టం చేశారు. ఆ హక్కును వినియోగించుకునేందుకు వెళ్లే అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం లేదా చించివేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమేనని పేర్కొన్నారు.

అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చూడాల్సిన పోలీసు వ్యవస్థ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి కూటమి కార్యకర్తల్లా ప్రవర్తించడం ఆందోళనకరమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల పాత్ర నిష్పక్షపాతంగా ఉండాలని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతిపక్ష అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ నామినేషన్లు దాఖలు చేసుకునేలా భరోసా కల్పించడం అధికార యంత్రాంగం బాధ్యత అని గురుమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యంగా దళిత మహిళలు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు, దాడులు చోటుచేసుకుంటున్నాయనే ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని ఎంపీ డిమాండ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అవసరమైతే జిల్లా కలెక్టరేట్లలో పోలీసు భద్రత మధ్య నామినేషన్లు స్వీకరించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించాలని, నామినేషన్ల గడువు పొడిగింపు, ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల స్వీకరణ వంటి చట్టబద్ధమైన ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను కూడా ఎన్నికల సంఘం పరిశీలించాలని సూచించారు.

ఎన్నికల నామినేషన్ల సమయంలో అభ్యర్థులపై జరిగిన దాడులు, బెదిరింపులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, ఎన్నికల పారదర్శకతను కాపాడేందుకు ఈ అంశాలను సంబంధిత రాజ్యాంగబద్ధ సంస్థల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.