-రాష్ట్ర ఎన్నికల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
చిత్తూరులో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులకి పాల్పడడం ఆందోళన కలిగిస్తున్నాయని గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులను అడ్డుకోవడం వారి రాజ్యాంగ బద్ధమైన హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు.
అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ ఎస్సీ కమిషన్ను కోరారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్రంలో దాడులు ఆగకపోవడం ఆందోళనకరమని విమర్శించారు.
ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించి, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నా, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నాయకులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నారాయణస్వామి వాహనంపై దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష నాయకులు, దళిత అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.
