ఆహార ప్రియులకు స‌ర‌స్ రుచుల విందు..

– ఆదివారం కావ‌డంతో కిట‌కిట‌లాడిన ప్రాంగ‌ణం
– వివిధ రాష్ట్రాల ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల ఉత్పత్తులకు ప్రోత్సాహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా ప్రాంగణంలోని లైవ్ ఫుడ్ కోర్టు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆహార ప్రియులు వివిధ రకాల సంప్రదాయ వంటకాలను ఆస్వాదించారు. రుచికరమైన ఆహార పదార్థాలు, విభిన్న ప్రాంతాల వంటకాలతో లైవ్ ఫుడ్ కోర్టు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైవ్ ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన 50 ఆహార విక్రయ కేంద్రాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ప్రత్యేక వంటకాలను అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాల సంప్రదాయ రుచులు, స్థానిక ప్రత్యేకతలతో కూడిన ఆహార పదార్థాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడికక్కడే వంటకాలను తయారు చేసి అందిస్తుండటంతో ఆహార ప్రియులు ఎంతో ఆసక్తిగా వాటిని ఆస్వాదిస్తున్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు సరస్ మేళా వేదిక:
సరస్ మేళా లైవ్ ఫుడ్ కోర్టు స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ ఆహార ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసుకునేందుకు, విక్రయాలను పెంచుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. విస్తృతమైన వినియోగదారుల ఆదరణతో మహిళా సంఘాలకు ఆదాయం పెరగడంతో పాటు, వారి వంటకాలకు గుర్తింపు లభిస్తోంది. మహిళల నైపుణ్యానికి, స్వయం ఉపాధికి, ఆర్థిక స్వావలంబనకు సరస్ మేళా ఒక మంచి వేదికగా నిలుస్తోంది. రుచుల వైవిధ్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించడంతో పాటు, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్‌ను అందిస్తున్న సరస్ మేళా లైవ్ ఫుడ్ కోర్టు సందర్శకుల ఆదరణతో ప్రత్యేక సందడిని సంతరించుకుంద‌ని ఎన్ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చిరంజీలాల్ క‌ఠారియా పేర్కొన్నారు.