విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నేతల విస్తృత ఎన్నికల ప్రచారం

-మాచవరం, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం, గుణదల ప్రాంతాల్లో ప్రజలతో మమేకమైన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కూటమి తరపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2, 4, 5, 6, 7, 8, 9వ డివిజన్ల పరిధిలోని మాచవరం, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం, గుణదల ప్రాంతాల్లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు నేతలకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానం వ్యక్తం చేశారు.

50 ఏళ్ల ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది: ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

ప్రచారంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా వరదల సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

కొండ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.

గత 50 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించామని, కొండ ప్రాంతం చుట్టుపక్కల సుమారు 26,500 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కల్పించినట్లు తెలిపారు. ఈ చర్యలతో అనేక కుటుంబాలకు సొంత ఇంటి స్థలం పొందే అవకాశం లభించిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఎంపీ చిన్ని అన్నారు.

విజయవాడ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ సమన్వయంతో పనిచేసే ప్రజాప్రతినిధులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.

మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న 86 మంది అభ్యర్థులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి నేతలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సంస్థల స్థాయిలోనూ మరింత ఊతం లభించేలా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చిన్ని వివరించారు.

ప్రజల స్పందన, ఆశీర్వాదాలే మా బలం: వంగవీటి రాధాకృష్ణ

మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ నేతలతో కలిసి ఐక్యతతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నగర అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు.

స్థానిక సంస్థల్లోనూ సమన్వయంతో అభివృద్ధి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. విజయవాడ నగర అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సంస్థల స్థాయిలోనూ సమన్వయం తోడైతే నగర అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని చెప్పారు.

కూటమి అభ్యర్థులు ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

ప్రజలతో మమేకమవుతూ సాగిన ప్రచారం

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సాగిన ప్రచారంలో కూటమి నేతలు స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.