-మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా విజయం ఖాయం – ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30వ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడంతో ఆయా డివిజన్లలో జనసందోహం నెలకొంది. ప్రచార మార్గంలో మహిళలు హారతులు పట్టి ఎంపీ కేశినేని చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహం, మహిళల ఆదరణతో ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ నగరంలోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజల మద్దతును ఓట్ల రూపంలో మలుచుకోవాలని సూచించారు.
విజయవాడ నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థుల విజయమే కీలకమని, ప్రజల ఆశీర్వాదంతో నగరంలో కూటమి ఘన విజయం సాధిస్తుందని ఎంపీ కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు.
