– ప్రతి వీధి పరిశుభ్రంగా.. ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉండాలి
– తుపాను అనంతర పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు
– క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో తుపాను అనంతరం పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, ప్రజల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఆదేశించారు. తుపాను ప్రభావం ముగిసినా అప్రమత్తత తగ్గించకూడదని, పారిశుధ్య లోపాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని స్పష్టం చేశారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో తుపాను కారణంగా ఎక్కడైనా చెత్తాచెదారం, బురద పేరుకుపోయినా, నీరు నిల్వ ఉన్నా యుద్ధప్రాతిపదికన తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ , జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రహదారులు, నివాస ప్రాంతాలు, మురుగు కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వనరుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను నిరంతరం చేపట్టాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తుపాను అనంతర పరిస్థితుల్లో వ్యాధుల వ్యాప్తి అవకాశాలను పర్యవేక్షించాలని, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నివారణపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే పరిస్థితులను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుభ్రపరిచిన నీటి ట్యాంకుల సంఖ్య, వినియోగించిన బ్లీచింగ్ పౌడర్ పరిమాణం, తొలగించిన ఘన వ్యర్థాల పరిమాణం టన్నుల్లో, వినియోగించిన ఫాగింగ్ యంత్రాల సంఖ్య, ఫాగింగ్ నిర్వహించిన ప్రాంతాల సంఖ్య వంటి వివరాలతో నివేదికలను సమర్పించాలన్నారు. తుపాను అనంతర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
