ఆత్మస్థైర్యంతో కోలుకుంటున్న గోపిక

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-త్వరలో స్కూల్ కూడా వెళతానంటున్న విద్యార్థిని
-మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపిన బాధితురాలు
-బాదిత కుటుంబానికి, విద్యార్థినికి అండగా కూటమి ప్రభుత్వం
-మహిళలు, బాలికల భద్రతకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం
-హంతకులకు అండగా జగన్
-రాప్తాడు నిందితుడికి న్యాయ సహకారం : మంత్రి సవిత మండిపాటు
-బెంగుళూరు మణిపాల్ లో విద్యార్థినికి మంత్రి సవిత పరామర్శ

బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త:
విద్యార్థిని గోపిక కోలుకుంటోందని, మంత్రి నారా లోకేశ్ మంచి వైద్యమందిస్తున్నారని, తాను త్వరలో స్కూల్ కూడా వెళ్లతానని, పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని ఆమె ఎంతో ఆత్మ స్థైర్యంతో చెబుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సొంత బిడ్డ మాదిరిగా గోపిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. నిందితుడు హేమంత్ ను కాపాడడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని, కూటమి ప్రభుత్వంపై బురదజల్లాలనే ఉద్దేశంతో, ఆయనెప్పుడూ హంతకులను వెంటేసుకుంటా వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోమహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక గోపికను మంత్రి సవిత శుక్రవారం పరామర్శించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గురువారం బాలికకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. దాడికి గురైన విషయం తెలిసిన వెంటనే విద్యార్థినిని అనంతపురం నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా తరలించి సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తనకు మెరుగైన వైద్యమందిస్తున్నారని, మంత్రి నారా లోకేశ్ కు విద్యార్థిని ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి సవిత సవిత వెల్లడించారు. తాను త్వరలో స్కూల్ కు వెళతానని, పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని విద్యార్థి గోపిక ఎంతో ఆత్మస్థైర్యంతో మాట్లాడుతోందని తెలిపారు. సబాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు , ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ గంగాధర్ రెడ్డి బాలిక వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు తమకు అండగా నిలిచి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారని మంత్రి సవిత వెల్లడించారు.

హంతకులకు జగన్ న్యాయ సహకారం

జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు చేస్తూ, హంతులను వెంటేస్తుకొస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడిని, రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడిని జగన్ అండగా నిలుస్తూ వస్తున్నారన్నారు. తన లీగల్ టీమ్ తో రాప్తాడు నిందితుడిని కాపాడడానికి హైకోర్టులో పిల్ వేశారన్నారు. ప్రజల మాన, ప్రాణాలకంటే జగన్ కు హంతకులే ముఖ్యమన్నారు. రాప్తాడు నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలోదాడి చేయడం వల్లే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపారన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా అదే వారికి చివరి రోజని మంత్రి సవిత హెచ్చరించారు. మహిళలు, బాలికలపై ఎక్కడైనా దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి సవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు.

విద్యార్థిని కుటుంబానికి భరోసా

అంతకుముందు ఆసుపత్రికి వెళ్లిన మంత్రి సవిత…విద్యార్థిని కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యమందించాలని సూచించారు. గోపిక త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంత్రి వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.