ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

– శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు
– జిల్లాలో తొమ్మిది చోట్ల కౌంటింగ్‌కు సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
– దాదాపు 1,500 మంది సూప‌ర్వైజ‌ర్లు, అసిస్టెంట్లు, ఇత‌ర స‌హాయ సిబ్బంది
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. 16 జెడ్‌పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాల‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జెడ్‌పీ సీఈవో పి.సుశీల‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, రిట‌ర్నింగ్ అధికారి కేవీఎస్ఆర్ ర‌వికుమార్‌తో క‌లిసి విజ‌య‌వాడ స‌బ్‌కలెక్ట‌ర్ కార్యాల‌యంవ‌ద్దగ‌ల మాంటిస్సోరి క‌ళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విజ‌య‌వాడ రూర‌ల్ కౌంటింగ్ కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ఓట్ల లెక్కింపున‌కు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. 18 కౌంటింగ్ హాళ్లు, 281 కౌంటింగ్ టేబుళ్ల‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సుమారు 1,500 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర సహాయ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరికి ఎన్నికల నిబంధనలు, ఓట్ల లెక్కింపు విధానం, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై తగిన శిక్ష‌ణ అందించినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రాల్లో కౌంటింగ్ హాళ్లు, టేబుళ్లు, బారికేడ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, వెలుతురు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. రిటర్నింగ్ అధికారులు రౌండ్ల వారీగా వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ధ్రువీకరించిన తర్వాత ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, బ‌య‌ట ప్ర‌దేశాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే గుర్తింపుకార్డుల‌తో అనుమతించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం, కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేసిన‌ట్లు వెల్ల‌డించారు.
తొమ్మిది చోట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు:
ఎ.కొండూరు, విస్స‌న్న‌పేట‌, తిరువూరు, గంప‌ల‌గూడెం మండ‌లాల సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ తిరువూరులోని శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ క‌ళాశాల కేంద్రంలో జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. విజ‌య‌వాడ రూర‌ల్ మండలానికి సంబంధించి విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఓల్డ్ మాంటిస్సోరి క‌ళాశాలలో జ‌రుగుతుంద‌న్నారు. జి.కొండూరుకు కుంట‌ముక్క‌ల‌లోని ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో కౌంటింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. అదేవిధంగా మైల‌వ‌రం, రెడ్డిగూడెం మండ‌లాల‌కు మైల‌వ‌రంలోని ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో, ఇబ్ర‌హీంప‌ట్నంకు కొండ‌ప‌ల్లి జెడ్‌పీ బాలిక‌ల హైస్కూల్‌లో, జ‌గ్గ‌య్య‌పేట‌, పెనుగంచిప్రోలు, వ‌త్స‌వాయి మండలాల‌కు జ‌గ్గ‌య్య‌పేట‌లోని ఎస్‌జీఎస్ క‌ళాశాల కేంద్రంలో జ‌రుగుతుంద‌న్నారు. నందిగామ మండ‌లానికి నందిగామ జెడ్‌పీ ఉన్న‌త‌పాఠ‌శాలలో, చంద‌ర్ల‌పాడుకు నందిగామ కేవీఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో కంచిక‌చ‌ర్ల‌, వీరుళ్ల‌పాడు మండ‌లాల‌కు కంచిక‌చ‌ర్ల మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.