ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఏపీ జట్ల ఎంపికలు ఈ నెల 10న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్ల ఎంపికలు ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వెల్లడించింది. అండర్–18 విభాగంలో బాలుర కబడ్డీ, బాలుర ఖోఖో, బాలబాలికల మల్లఖంబ్ జట్లకు ఈ ఎంపికలు నిర్వహించనున్నారు. కబడ్డీ జట్టు ఎంపికలు గుంటూరులోని బీఆర్ స్టేడియంలో, ఖోఖో జట్టు ఎంపికలు కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో, మల్లఖంబ్ జట్ల ఎంపికలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎస్సీహెచ్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో నిర్వహించనున్నారు.

2009 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన క్రీడాకారులు ఈ ఎంపిక పోటీలకు అర్హులని అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు పదో తరగతి మార్కుల మెమో, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదానితో ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు సంబంధిత క్రీడా ప్రాంగణాలకు చేరుకుని ఆయా జిల్లాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను (DSDO) సంప్రదించాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఇతర వివరాల కోసం 9908267811 నంబరును సంప్రదించాలని శాప్ అధికారులు కోరారు.